Ukraine Crisis: దిగివచ్చిన పుతిన్‌.. ఉక్రెయిన్‌తో చర్చలకు సిద్ధం..!

ఉక్రెయిన్‌పై దురాక్రమణ మొదలుపెట్టిన రష్యా దూకుడుగా ముందుకెళ్తోంది. ఇప్పటికే రష్యా సైన్యం రాజధాని కీవ్‌లోని ఓ జిల్లాల్లోకి ప్రవేశించింది. అనూహ్య దాడులతో

Published : 26 Feb 2022 01:25 IST

మాస్కో: రష్యా-ఉక్రెయిన్‌ మధ్య భీకర దాడులు కొనసాగుతున్న వేళ రష్యా అధ్యక్షుడి కార్యాలయం కీలక ప్రకటన చేసింది. ఉక్రెయిన్‌ అధికారుల బృందంతో చర్చలకు సిద్ధమని తెలిపింది. చర్చలకు బెలారస్‌ రాజధాని మిన్‌స్క్‌కు రష్యా బృందాన్ని పంపిస్తామని వెల్లడించింది. ఉక్రెయిన్‌ సైన్యం ఆయుధాలు వీడితే చర్చలకు తాము సిద్ధమేనంటూ ఇప్పటికే రష్యా విదేశాంగశాఖ మంత్రి ప్రకటించిన విషయం తెలిసిందే. మరోవైపు, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ కూడా పుతిన్‌తో ఫోన్‌లో సంభాషించారు. ఉక్రెయిన్‌తో చర్చలు జరపాలని ఆయన కూడా సూచించారు. ఈ నేపథ్యంలో రష్యా అధ్యక్ష కార్యాలయం నుంచి ఈ ప్రకటన వెలువడటం గమనార్హం.

మరోవైపు యుద్ధాన్ని ఆపాలని.. చర్చలు జరపాలని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు రష్యాను కోరారు. ఈ నేపథ్యంలో రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లారోవ్‌ కూడా కీలక ప్రకటన చేశారు. ఉక్రెయిన్‌ సేనలు ‘ఆయుధాలు వీడితే’ చర్చలకు సిద్ధమని ప్రకటించారు. ‘‘ఉక్రెయిన్‌ వాసులకు అణచివేత నుంచి స్వేచ్ఛ కల్పించేందుకే ఈ సైనిక ఆపరేషన్‌ చేపట్టాం. దీని తర్వాత వారు తమ భవిష్యత్తును నిర్ణయించుకోవచ్చు. అయితే ఉక్రెయిన్‌ ఎదురుదాడికి దిగుతోంది. ఒకవేళ ఉక్రెయిన్‌ ఆర్మీ సేనలు ఆయుధాలు వదలిపెడితే ఆ దేశంలో మేం చర్చలు జరిపేందుకు సిద్ధం’’ అని సెర్గీ లావోస్‌ వెల్లడించారు. 

ఆంక్షలకు ప్రతీకారం తప్పదు..

మరోవైపు ఉక్రెయిన్‌పై యుద్ధం నేపథ్యంలో రష్యాపై పశ్చిమ దేశాలు ఆంక్షలు విధిస్తోన్న విషయం తెలిసిందే. అయితే ఈ ఆంక్షలకు ప్రతీకారం తప్పదని క్రెమ్లిన్‌ హెచ్చరించింది. ‘‘ఆంక్షలకు ప్రతిచర్య చేపట్టకుండా ఉండబోం’’ అని క్రెమ్లిన్‌ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్‌ అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని