IND vs SA: చివరి ఓవర్‌ షంసి వస్తాడని తెలుసు.. అదే నా గేమ్‌ ప్లాన్‌: సంజూ శాంసన్‌

టాప్‌ ఆర్డర్‌ విఫలం కావడంతో దక్షిణాఫ్రికా నిర్దేశించిన 250 పరుగుల లక్ష్య ఛేదనలో టీమ్‌ఇండియా 240 పరుగులకే పరిమితమై ఓటమిపాలైంది.

Published : 07 Oct 2022 14:24 IST

ఇంటర్నెట్ డెస్క్‌: దక్షిణాఫ్రికా నిర్దేశించిన 250 పరుగుల లక్ష్య ఛేదనలో టాప్‌ ఆర్డర్‌ వైఫల్యంతో టీమ్‌ఇండియా 240 పరుగులకే పరిమితమై ఓటమిపాలైంది. అయితే చివర్లో సంజూ శాంసన్- శార్దూల్‌ ఠాకూర్ జోడీ 93 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంతో భారత్‌కు గెలుపుపై ఆశలు చిగురించాయి. అయితే, కీలక సమయంలో ఠాకూర్‌ పెవిలియన్‌కు చేరడంతోపాటు వరుసగా మూడు వికెట్లను కోల్పోయి టీమ్‌ఇండియా కష్టాల్లో పడింది. కానీ, అటువైపు క్రీజ్‌లో శాంసన్‌ (86*) ఉండటంతో కాస్త నమ్మకంగా ఉన్నప్పటికీ.. రబాడ, ఎంగిడి కీలకమైన 38, 39వ ఓవర్లను కట్టుదిట్టంగా వేసి పరుగులను నియంత్రించి వికెట్లను కూల్చారు. 

చివరి ఓవర్‌లో భారత్‌ విజయానికి 30 పరుగులు అవసరమైన వేళ.. షంసి బౌలింగ్‌లో సంజూ 20 పరుగులు రాబట్టగలిగాడు. అయితే, 39వ ఓవర్‌లో ఒక్క బంతిని కూడా సంజూ స్ట్రైక్‌ చేయకపోవడంతో లక్ష్య ఛేదన కష్టంగా మారిందని విమర్శలు వచ్చాయి. రబాడ వేసిన ఆ ఓవర్‌లో ఏడు పరుగులే రాగా.. కనీసం ఓ 15 పరుగులు రాబట్టినా ఫలితం మరోలా ఉండేదనే అభిప్రాయం  అభిమానుల్లో నెలకొంది. ఈ క్రమంలో తన బ్యాటింగ్‌ ప్లాన్‌ గురించి సంజూ శాంసన్‌ వెల్లడించాడు.

‘‘మిడిల్‌ ఓవర్లలో బ్యాటింగ్ చేయడం నాకెప్పుడూ ఇష్టమే.  చివర్లో ఓ రెండు షాట్లు అనుకున్న స్థాయిలో ఆడలేదు. వచ్చే మ్యాచ్‌లో వాటిపై కసరత్తు చేస్తా. అయితే నా ఇన్నింగ్స్‌ పట్ల సంతృప్తిగా ఉన్నా. వారి బౌలర్లు చాలా కట్టుదిట్టంగా వేశారు. షంసి మాత్రమే ఎక్కువగా పరుగులు ఇచ్చాడు. అందుకే అతడిని టార్గెట్‌ చేశా. చివరి ఓవర్‌ షంసి వేస్తాడని తెలుసు. కనీసం 24 పరుగులైనా సాధించాలని అనుకొన్నా. ఓ నాలుగు సిక్స్‌లు బాదగలనని భావించా. అయితే, అంతకుముందు రెండు ఓవర్లను దక్షిణాఫ్రికా బౌలర్లు బాగా వేశారు’’ అని సంజూ తెలిపాడు. బౌలింగ్‌ విభాగంలో టీమ్‌ఇండియా మెరుగవ్వాల్సిన అవసరం ఉందని శాంసన్‌ పేర్కొన్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని