Ukraine Crisis: ఆహారం కోసం బయటకు వెళ్లి.. బాంబు దాడికి బలై..

ఉక్రెయిన్‌పై రష్యా జరుపుతున్న దాడుల్లో భారత విద్యార్థి ఒకరు ప్రాణాలు కోల్పోవడం దేశ ప్రజలకు ఆందోళనకు గురిచేస్తోంది. ఉక్రెయిన్‌లోని రెండో అతిపెద్ద నగరమైన ఖార్కివ్‌లో

Updated : 01 Mar 2022 19:45 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఉక్రెయిన్‌పై రష్యా జరుపుతున్న దాడుల్లో భారత విద్యార్థి ఒకరు ప్రాణాలు కోల్పోవడం దేశ ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. ఉక్రెయిన్‌లోని రెండో అతిపెద్ద నగరమైన ఖార్కివ్‌లో ఈ ఉదయం రష్యా ప్రయోగించిన షెల్‌ దాడిలో కర్ణాటకకు చెందిన నవీన్‌ శేఖరగౌడ ప్రాణాలు కోల్పోయాడు. 

కర్ణాటకలోని హవేరీ జిల్లాకు చెందిన నవీన్‌.. ఖార్కివ్‌లోని నేషనల్ మెడికల్‌ కాలేజీలో మెడిసిన్‌ నాలుగో సంవత్సరం చదువుతున్నాడు. ఖార్కివ్‌లోని గవర్నర్‌ కార్యాలయం పక్కనే ఉన్న అపార్ట్‌మెంట్‌లో స్నేహితులతో కలిసి ఉంటున్నాడు. గత కొద్ది రోజులుగా ఖార్కివ్‌లో భయానక పరిస్థితులు నెలకొనడంతో వీరంతా సమీపంలోని బంకర్‌లోకి వెళ్లారు. 

ఉదయమే తండ్రితో మాట్లాడి..

ఈ ఉదయం నవీన్ కర్ణాటకలో ఉంటున్న తన తండ్రికి ఫోన్‌ చేసినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. బంకర్‌లో భోజనం, నీళ్లు లేవని అప్పుడు నవీన్‌ చెప్పినట్లు పేర్కొన్నారు. దీంతో ఈ ఉదయం అతడు కరెన్సీ మార్చుకుని ఆహారం తెచ్చుకునేందుకు బంకర్‌ నుంచి బయటకు వచ్చాడు. గవర్నర్‌ కార్యాలయానికి సమీపంలోనే ఉన్న ఓ గ్రాసరీ స్టోర్‌కు వెళ్లి అక్కడ క్యూలైన్‌లో నిల్చున్నాడు. అదే సమయంలో రష్యా బలగాలు.. గవర్నర్‌ కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకుని షెల్‌ ప్రయోగించింది. అయితే అది కాస్తా గురితప్పి గ్రాసరీ స్టోర్‌ సమీపంలో పడింది. దీంతో నవీన్‌ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. 

ఈ ఉదయం ఖార్కివ్‌లోని భారత విద్యార్థి కో ఆర్డినేటర్‌ పూజ ప్రహరాజ్‌ నవీన్‌కు ఫోన్‌ చేశారు. అయితే అప్పటికే బాంబు దాడిలో నవీన్‌ మృతిచెందాడు. అతడి ఫోన్‌ను స్థానిక ఉక్రెయిన్‌ మహిళ ఒకరు లిఫ్ట్‌ చేసి.. నవీన్‌ మృతదేహాన్ని మార్చురీకి తీసుకెళ్లినట్లు చెప్పారని పూజ తెలిపారు. 

కర్ణాటక సీఎం విచారం..

నవీన్‌ మృతిపై కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. విద్యార్థి కుటుంబానికి సానుభూతి ప్రకటించారు. అతడి మృతదేహాన్ని స్వదేశానికి తరలించేందుకు విదేశాంగ శాఖతో సంప్రదింపులు జరుపుతున్నట్లు బొమ్మై తెలిపారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని