Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Published : 28 Jan 2022 20:56 IST

1.మాదకద్రవ్యాల నియంత్రణ.. ఎంతటివారైనా ఉపేక్షించవద్దు : కేసీఆర్‌

తెలంగాణలో మాదకద్రవ్యాల విక్రయాలపై ఉక్కుపాదం మోపాలని సీఎం కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. సమూలంగా డ్రగ్స్‌ నిర్మూలనకు వినూత్నంగా ఆలోచించాలన్నారు. డ్రగ్స్‌ నిర్మూలనకు ప్రతి ఒక్కరి సహకారం తీసుకోవాలన్నారు. సామాజిక ఉద్యమంగా మలచినప్పుడే డ్రగ్స్‌ కట్టడి సాధ్యమవుతుందన్నారు. మాదక ద్రవ్యాల నియంత్రణపై ప్రగతి భవన్‌లో కేసీఆర్‌ కీలక సమీక్ష నిర్వహించారు.

2.సమస్యల నుంచిదృష్టి మళ్లించేందుకే కొత్త జిల్లాల డ్రామా: చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వ అస్తవ్యస్త విధానాలపై కేంద్రం దృష్టి పెట్టాలని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. చంద్రబాబు పార్టీ ఎంపీలతో వర్చువల్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్థిక ఉల్లంఘనలతో రాష్ట్రం అంధకారంలోకి వెళ్తోందన్నారు. 28 మంది వైకాపా ఎంపీలు రాష్ట్రానికి ఏం తెచ్చారు? అని ప్రశ్నించారు. పాలన అంటే అప్పు చేయడం, దోచుకోవడం అన్నట్లుగా మారిందని విమర్శించారు.

3.సీఎం సారూ..రజత్‌కుమార్‌ అవినీతి ఆరోపణలపై విచారణ చేపట్టారా? : రేవంత్‌

తెలంగాణ నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమాపై వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణ చేయించాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆయన లేఖ రాశారు. రజత్ కుమార్, షెల్ కంపెనీల మధ్య ఆర్థిక లావాదేవీలపై న్యాయస్థానం పర్యవేక్షణలో విచారణ జరిపించాలని కోరారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో సంబంధం ఉన్న ఇతర అధికారులతోపాటు, ప్రభుత్వంలోని పెద్దలపై వచ్చిన అవినీతి ఆరోపణలపైనా విచారణ జరిపించాలన్నారు.

TS News: చిరుధాన్యాల రంగంలోకి రాష్ట్ర వ్యవసాయ పరిశ్రమ అభివృద్ధి సంస్థ

4.భాజపా ఆస్తులు రూ.4,847 కోట్లు.. కాంగ్రెస్‌ కంటే 8 రెట్లు ఎక్కువ.. మరి తెరాస?

వరుసగా రెండుసార్లు అత్యధిక సీట్లు సాధించి కేంద్రంలో సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన భాజపా (BJP).. ఆస్తుల విషయంలోనూ మరే జాతీయ పార్టీకి సాధ్యం కాని రీతిలో సత్తా చాటుతోంది. ఏటేటా తన ఆర్థిక బలాన్ని పెంచుకుంటోంది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో భాజపా రూ.4,847.78కోట్ల విలువైన ఆస్తులను ప్రకటించింది. కాంగ్రెస్‌ (Congress)తో పోలిస్తే కాషాయ పార్టీ ఆస్తుల విలువ ఏకంగా 8 రెట్లకు పైనే ఉండటం గమనార్హం.

5.‘ఒమిక్రాన్‌తో దీర్ఘకాలిక ప్రభావం.. బూస్టర్‌ డోసులు తీసుకోవాల్సిందే’

కరోనా తాజా వేరియంట్‌ ఒమిక్రాన్‌ ప్రపంచ దేశాలను చుట్టుముట్టింది. ఆయా దేశాల్లో నమోదవుతున్న అత్యధిక కేసులు ఇవేనని అక్కడి అధికారులు వెల్లడిస్తున్నారు. అయితే వ్యాప్తి అత్యధికంగానే ఉన్నప్పటికీ ప్రభావం తక్కువగా ఉంటుందని కొందరు శాస్త్రవేత్తలు చెబుతుండగా.. ప్రభావం తీవ్రంగానే ఉంటుందని మరికొందరు పేర్కొంటున్నారు. ఒమిక్రాన్‌ ఎఫెక్ట్‌ స్వల్పం కాదని.. దీర్ఘకాలిక ప్రభావం చూపుతుందని అమెరికాకు చెందిన ప్రముఖ అంటువ్యాధుల నిపుణుడు డా.ఫహీమ్‌ యోనస్‌ వెల్లడించారు.

6.నిర్మలమ్మకు అవే ఆరు సవాళ్లు..!

ప్రకృతి విపత్తులు, అంటు రోగాలు ప్రబలిన సమయంలో కోట్ల మంది ఉపాధి కోల్పోతారు. ఫలితంగా ప్రజలు నిధులకు కటకటలాడుతుంటారు. అదే సమయంలో ఉత్పత్తి పడిపోయి ధరలు పెరుగుతుంటాయి. ఆ సమయంలో ప్రభుత్వాలకు పన్ను ఆదాయాలు పడిపోవడమే కాకుండా ఖర్చులు కూడా పెరుగుతాయి. అలాంటి సమయంలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం కత్తిమీద సామే. గత రెండేళ్లుగా దేశం కరోనా సంక్షోభాన్ని చవిచూస్తోంది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి1న ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌ కేంద్ర బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్నారు. కీలక సవాళ్లకు ఆమె పరిష్కారం చూపించాల్సి ఉంది.

7.ఆస్తి కోసం తల్లినే గెంటేశాడు.. సిద్ధూపై సోదరి సంచలన వ్యాఖ్యలు

పంజాబ్​ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ ఆ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు నవజ్యోత్​ సింగ్​ సిద్ధూపై ఆయన సోదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆస్తి కోసం తల్లిని, తనను ఇంట్లోంచి గెంటేశారని ఆరోపించారు. సిద్ధూ తండ్రి మొదటి భార్య కుమార్తె అయిన ప్రవాస భారతీయురాలు సుమన్‌ తూర్‌ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. తన తల్లి పడిన కష్టాలను వివరిస్తూ పలుమార్లు భావోద్వేగానికి గురయ్యారు.

Heart Attack: షుగర్‌ జబ్బుతో గుండెపోటు ముప్పు..!

8.ఏడేళ్లుగా ఎంపీ.. అయినా అద్దె ఇంట్లోనే ఉంటున్నారు: కేజ్రీవాల్‌ ప్రశంస

పంజాబ్‌లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ ప్రచారం జోరందుకుంది. ఎన్నికల బరిలో నిలిచిన ప్రధాన పార్టీల అగ్రనేతలు రంగంలోకి దిగి తమ అభ్యర్థుల తరఫున ప్రచారంలో తలమునకలయ్యారు. నిన్న కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ పంజాబ్‌లో పర్యటించగా.. తాజాగా ఆప్‌ జాతీయ కన్వీనర్‌, దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ చండీగఢ్‌లో తమ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, సంగ్రూర్‌ ఎంపీ, ప్రస్తుత ఎన్నికల్లో సీఎం అభ్యర్థి భగవంత్‌ మాన్‌కు మద్దతుగా ప్రచారంలో పాల్గొన్నారు.

9.బ్రెండన్‌ టేలర్‌పై మూడున్నరేళ్లు నిషేధం

క్రికెట్‌లో స్పాట్‌ ఫిక్సింగ్‌ చేసేందుకు తనను ఓ భారత వ్యాపారి సంప్రదించడం గురించి ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ)కి ఆలస్యంగా సమాచారమిచ్చినందుకుగానూ జింబాబ్వే మాజీ కెప్టెన్‌ బ్రెండన్‌ టేలర్‌పై ఐసీసీ మూడున్నరేళ్లు నిషేధం విధించింది. ‘బ్రెండన్‌ ఐసీసీ నిబంధనలను ఉల్లంఘించినట్లు స్వయంగా అంగీకరించాడు. అతను మాదక ద్రవ్యాలు తీసుకున్నట్లు, అవినీతికి పాల్పడినట్లు ఒప్పుకున్నాడు.

10.పార్టీ ఏదైనా.. గెలుపు మాత్రం ఆయనదే..

సాధారణంగా కొంతమంది టికెట్లు ఆశించో, గెలుపు కోసమో ఎన్నికల వేళ రాజకీయ పార్టీలు మారుతుంటారు. కానీ ఈయన ఏ పార్టీకి వెళ్లినా.. చివరకు స్వతంత్రుడిగా పోటీ చేసినా.. ఓటర్లు మాత్రం ఆయన్నే గెలిపిస్తున్నారు. ఈ అరుదైన ప్రత్యేకతను దక్కించుకుంది.. ఉత్తరప్రదేశ్‌లోని మథుర జిల్లా మాంట్‌ నియోజకవర్గం. ప్రజల హృదయాలను గెలిచిన ఆ జన నేత పేరు శ్యామ్‌ సుందర్ శర్మ.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని