PUBG: ‘పబ్జీ’ గేమ్‌కు బానిసై కుటుంబాన్నే కాల్చి చంపిన బాలుడు!

ఆన్‌లైన్‌లో నిత్యం పబ్జీ (PUBG) గేమ్‌ ఆడుతూ.. దానికి బానిసైన ఓ బాలుడు తన కుటుంబసభ్యులనే కడతేర్చాడు. తల్లి, సోదరుడితోపాటు ఇద్దరు మైనర్ సోదరీమణులను కాల్చిచంపాడు......

Published : 29 Jan 2022 02:10 IST

లాహోర్‌: ఆన్‌లైన్‌లో నిత్యం పబ్జీ (PUBG) గేమ్‌ ఆడుతూ.. దానికి బానిసైన ఓ బాలుడు తన కుటుంబ సభ్యులనే కడతేర్చాడు. తల్లి, సోదరుడితో పాటు ఇద్దరు సోదరీమణులను కాల్చిచంపాడు. ఈ దారుణ ఘటన పాకిస్థాన్‌లో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. లాహోర్‌లోని కహ్నా ప్రాంతానికి చెందిన నహిద్‌ ముబారక్‌ (45) హెల్త్‌ వర్కర్‌గా పనిచేస్తున్నారు. కొన్నేళ్ల క్రితమే భర్తతో విడిపోయి పిల్లలతో కలిసి ఉంటున్నారు.

అయితే, 14 ఏళ్ల కుమారుడు ఇంట్లో ఒంటరిగా ఉంటూ.. నిత్యం ఆన్‌లైన్‌లో పబ్జీ ఆడుతూ దానికి బానిసయ్యాడు. చదువును పక్కనపెట్టేశాడు. తల్లి పలుమార్లు మందలించినా అతడి ప్రవర్తనలో మార్పు రాలేదు. ఇదే విషయంపై కుమారుడిని నహిద్‌ మళ్లీ మందలించింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన బాలుడు కప్‌బోర్డులోని తుపాకీ తీసుకొని తల్లితోపాటు సోదరుడు (22), ఇద్దరు సోదరీమణులు (17), (11)ను కాల్చి చంపాడు. అనంతరం తన కుటుంబాన్ని ఎవరో చంపారంటూ పొరుగింటివారికి తెలియజేశాడు. వారు ఇచ్చిన సమాచారంతో మృతుల ఇంటికి చేరుకున్న పోలీసులు బాలుడిని విచారించారు. అయితే తనకేమీ తెలియదని, ఘటన జరిగినప్పుడు తాను ఇంటిపై ఉన్నానని బుకాయించాడు.

అనుమానంతో పోలీసులు కాస్త గట్టిగా విచారించడంతో నిజం అంగీకరించాడు. హత్య చేసిన తర్వాత తుపాకీని మురికి కాలువలో పడేసినట్లు తెలిపాడు. సంఘటన సమయంలో అతడు ధరించిన దుస్తులను స్వాధీనం చేసుకున్నారు. పబ్జీకి బానిసైపోవడంతో బాలుడి మానసిక పరిస్థితి సరిగా లేనట్లు పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం వైద్య పరీక్షల కోసం తరలించినట్లు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని