RattanIndia-Revolt: రతన్‌ ఇండియా చేతికి రివోల్ట్‌

భారత విద్యుత్తు వాహన పరిశ్రమలో మరో కీలక పరిణామం జరిగింది. విద్యుత్తు బైక్‌ల తయారీ సంస్థ రివోల్ట్‌లో 100 శాతం వాటాలను రతన్‌ఇండియా ఎంటర్‌ప్రైజెస్‌ సొంతం చేసుకుంది.

Published : 07 Oct 2022 17:25 IST

దిల్లీ: విద్యుత్తు మోటార్‌సైకిళ్ల తయారీ సంస్థ రివోల్ట్‌ మోటార్స్‌లో 100 శాతం వాటాలను కొనుగోలు చేస్తున్నట్లు రతన్‌ఇండియా ఎంటర్‌ప్రైజెస్‌ శుక్రవారం తెలిపింది. ఇప్పటికే ఈ సంస్థకు కంపెనీలో 33.84 శాతం వాటాలు ఉన్నాయి. తాజాగా మిగిలిన మొత్తాన్ని కూడా సొంతం చేసుకుంటున్నట్లు తెలిపింది. అయితే, ఈ ఒప్పంద విలువను మాత్రం బహిర్గతం చేయలేదు. ఈ ప్రకటన నేపథ్యంలో రతన్‌ ఇండియా ఎంటర్‌ప్రైజెస్‌ షేర్లు ఇంట్రాడేలో 10 శాతానికి పైగా పెరిగి రూ.55.25 వద్ద గరిష్ఠాన్ని తాకాయి.

‘‘ఇప్పటి వరకు రివోల్ట్‌ ప్రపంచంలోనే అత్యుత్తమ విద్యుత్తు బైక్‌. సాంకేతికత, ధర, బిల్డ్‌ క్వాలిటీ, పెర్ఫార్మెన్స్‌.. ఇలా అన్ని అంశాల్లో ఇది అత్యుత్తమమైంది. భారత్‌లో ఈవీ రెవల్యూషన్‌ మేం ఊహించినదాని కంటే ముందుగానే వస్తోందని విశ్వసిస్తున్నాం. ఆ నమ్మకంతోనే రివోల్ట్‌లో 100 శాతం వాటాలను కొనుగోలు చేస్తున్నాం. దేశానికీ, పర్యావరణానికీ మంచి చేసేది కచ్చితంగా గొప్ప వ్యాపారంగా రూపాంతరం చెందుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు’’ అని రతన్‌ ఇండియా ఛైర్‌పర్సన్‌ అంజలి రతన్‌ అన్నారు. 

భారత్‌లో విద్యుత్తు వాహన పరిశ్రమ వేగంగా వృద్ధి చెందుతోంది. ఇటీవలే యూలర్‌ మోటార్స్‌, యులు కంపెనీలు మిలియన్‌ డాలర్ల పెట్టుబడులను సమీకరించాయి. మరోవైపు దేశీయ కంపెనీలైన మహీంద్రా అండ్‌ మహీంద్రా, టాటా మోటార్స్‌ సైతం పెద్ద ఎత్తున తమ విద్యుత్తు వాహన తయారీ ప్రణాళికలను అమలు చేస్తున్నాయి. ఈ తరుణంలో రతన్‌ఇండియా, రివోల్ట్‌ ఒప్పందం కుదరడం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని