Modi: నాలుగో పారిశ్రామిక విప్లవానికి భారత్‌ నాయకత్వం.. మోదీ ఆకాంక్ష

నాలుగో పారిశ్రామిక విప్లవాన్ని ముందుకు నడిపే సత్తా భారత్‌కు ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ప్రపంచ తయారీ కేంద్రంగా భారత్‌ను తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ఇప్పటికే అనేక సంస్కరణలు చేపట్టిందని తెలిపారు.

Published : 07 Oct 2022 16:32 IST

కెవడియా: నాలుగో పారిశ్రామిక విప్లవాన్ని ముందుకు నడిపే సత్తా భారత్‌కు ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ప్రపంచ తయారీ కేంద్రంగా భారత్‌ను తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ఇప్పటికే పలు సంస్కరణలు చేపట్టిందని తెలిపారు. ఇండస్ట్రీ 4.0 పేరిట గుజరాత్‌లోని కెవడియాలో జరిగిన సమావేశంలో శుక్రవారం ప్రధాని సందేశాన్ని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ సంయుక్త కార్యదర్శి చదివి వినిపించారు.

నాలుగో పారిశ్రామిక విప్లవం పూర్తిగా టెక్నాలజీ, నవీన ఆవిష్కరణల ఆధారితమైందని మోదీ పేర్కొన్నారు. పలు కారణాల వల్ల భారత్‌ గత పారిశ్రామిక విప్లవాల్లో కీలక పాత్ర పోషించలేకపోయిందన్నారు. కానీ, ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయన్నారు. ప్రపంచ సరఫరా వ్యవస్థలో భారత్‌ను కీలక భాగస్వామిగా మార్చడంలో పరిశ్రమలు, పారిశ్రామికవేత్తలు కీలక భూమిక పోషిస్తున్నారని తెలిపారు.

భారత్‌లో తయారీ రంగాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోందని కేంద్ర భారీ పరిశ్రమలశాఖ మంత్రి మహేంద్రనాథ్‌ పాండే తెలిపారు. మెషీన్‌ లెర్నింగ్‌, త్రిడీ ప్రింటింగ్‌, డేటా అనలిటిక్స్‌, ఐఓటీ.. వంటి రంగాలకు భారత పారిశ్రామిక అభివృద్ధిని ముందుకు నడిపించనున్నాయని పేర్కొన్నారు. ‘అడ్వాన్స్‌డ్‌ కెమికల్‌ సెల్‌ (ACC)’ బ్యాటరీ స్టోరేజ్‌ పరిశ్రమకు ప్రకటించిన ‘ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల (PLI)’ వల్ల భవిష్యత్తులో భారత్‌కు బ్యాటరీ దిగుమతులు తగ్గుతాయని తెలిపారు. రూ.18 వేల కోట్ల రాయితీల వల్ల దేశీయ కంపెనీలు బ్యాటరీల తయారీని పెంచనున్నాయని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని