VIDA V1: హీరో మోటోకార్ప్‌ విద్యుత్‌ స్కూటర్‌ వచ్చేసింది.. ధర, ఫీచర్లివే

ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ కంపెనీ హీరో మోటోకార్ప్‌ విద్యుత్‌ వాహన రంగంలోకి అడుగు పెట్టింది. విడా వీ1 పేరిట తొలి విద్యుత్‌ స్కూటర్‌ను లాంచ్‌ చేసింది.

Published : 07 Oct 2022 17:12 IST

జైపూర్‌: ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ కంపెనీ హీరో మోటోకార్ప్‌ (Hero MotoCorp) విద్యుత్‌ వాహన రంగంలోకి అడుగు పెట్టింది. విడా వీ1 (VIDA V1) పేరిట తొలి విద్యుత్‌ స్కూటర్‌ను శుక్రవారం లాంచ్‌ చేసింది. రెండు వేరియంట్లలో ఈ స్కూటర్‌ను తీసుకొచ్చారు. విడా వీ1 ప్లస్‌, విడా వీ1 ప్రో పేరిట వీటిని విడుదల చేశారు. వీ1 ప్లస్‌ ధరను రూ.1.45 లక్షలుగానూ, వీ1 ప్రో ధరను రూ.1.59 లక్షలుగానూ నిర్ణయించారు.

సింగిల్‌ ఛార్జ్‌తో విడా వీ1 మోడల్‌ 143 కిలోమీటర్ల రేంజ్‌ ప్రయాణిస్తుంది. విడా ప్రో మోడల్‌ 165 కిలోమీటర్లు ప్రయాణించొచ్చు. రిమూవబుల్‌ బ్యాటరీ, పోర్టబుల్‌ ఛార్జర్‌తో ఈ బైక్‌ వస్తోంది. అక్టోబర్‌ 10 నుంచి ఈ స్కూటర్‌ బుకింగ్‌లు ప్రారంభం కానున్నాయి. డిసెంబర్‌ రెండో వారం నుంచి డెలివరీలు ప్రారంభించనున్నట్లు కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. విడా వీ1 కేవలం స్కూటర్‌ మాత్రమే కాదని, ఈ సెగ్మెంట్‌లో ఓ పవర్‌ ఛేంజ్‌ కానుందని హీరో మోటోకార్ప్‌ ఛైర్మన్‌, సీఈఓ పవన్‌ ముంజాల్‌ విడుదల సందర్భంగా పేర్కొన్నారు. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న బజాజ్‌ చేతక్‌, టీవీఎస్‌ ఐక్యూబ్‌తో పాటు ఏథర్‌ ఎనర్జీ, హీరో ఎలక్ట్రిక్‌, ఓలా ఎలక్ట్రిక్‌ బైక్‌లకు విడా పోటీగా నిలవనుంది.

ప్రస్తుతం సంప్రదాయ ఇంధన విభాగంలో అగ్రస్థానంలో ఉన్న హీరో మోటోకార్ప్‌.. విద్యుత్‌ వాహన విభాగంలోనూ దూకుడుగా వెళ్లాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా అమెరికాకు చెందిన జీరో మోటార్‌ సైకిల్స్‌లో రూ.490 కోట్లు పెట్టుబడి పెట్టింది. ఆ కంపెనీతో కలిసి ఎలక్ట్రిక్‌ మోటార్‌ సైకిల్స్‌ రూపొందించాలని నిర్ణయించింది. ఇప్పటికే ఏథర్‌ ఎనర్జీలో హీరో మోటోకార్ప్‌కు 35 శాతం వాటా ఉంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని