వచ్చే 4 నెలలు ఎంతో కీలకం

స్టాక్‌ మార్కెట్లో సెప్టెంబరు వరకు హెచ్చుతగ్గులు కొనసాగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఎడిల్‌వైజ్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ చీఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఆఫీసర్‌ (సీఐఓ-ఈక్విటీస్‌) అన్నారు. వడ్డీ

Published : 21 May 2022 02:37 IST

విడతలుగా పెట్టుబడులు మేలు

ఎడిల్‌వైజ్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ సీఐఓ త్రిదీప్‌ భట్టాచార్య

ఈనాడు, హైదరాబాద్‌: స్టాక్‌ మార్కెట్లో సెప్టెంబరు వరకు హెచ్చుతగ్గులు కొనసాగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఎడిల్‌వైజ్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ చీఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఆఫీసర్‌ (సీఐఓ-ఈక్విటీస్‌) అన్నారు. వడ్డీ రేట్ల పెంపు ప్రారంభం కావడం, అధిక ధరలు, అంతర్జాతీయ పరిణామాలు ఇందుకు కారణాలుగా చెప్పారు. ‘దేశంలో ప్రైవేటు రంగంలో పెట్టుబడులు గతంతో పోలిస్తే 5-6 రెట్లు పెరిగాయి. మార్కెట్‌కు ఇది ఎంతో సానుకూల పరిణామం. 2-3 ఏళ్లలో ఆర్థిక వ్యవస్థ వృద్ధితో పాటు, మార్కెట్‌ సూచీలను మరో స్థాయికి తీసుకెళ్లేందుకు ఇది తోడ్పడుతుంది. ఇప్పుడు స్థిరాస్తి విపణ సైతం వృద్ధి చెందుతోంది. కంపెనీల పనితీరు మెరుగవడంతో, ద్రవ్యోల్బణంతో సంబంధం లేకుండా ఉద్యోగుల జీతాల్లో రెండంకెల వృద్ధి కనిపించింది. అందువల్ల ‘ఖర్చు చేసే శక్తి, మిగులు నిధులు’ ఉద్యోగులకు పెరగడం వల్ల ఆర్థిక వ్యవస్థలోకి నగదు ప్రవాహం పెరుగుతోంది. అందుకే, మధ్యస్థ కాలంలో మార్కెట్‌లో స్థిరమైన కదలిక ఉంటుంద’ని శుక్రవారం ఆయన ఇక్కడ వివరించారు.

జూన్‌, సెప్టెంబరు త్రైమాసికాల్లో కంపెనీల ఫలితాలు స్థిరంగా ఉన్నా.. అక్కడి నుంచి మంచి పనితీరు చూపిస్తాయనే అంచనాలున్నాయని తెలిపారు. మార్కెట్లో దిద్దుబాటు సాధారణ స్థాయుల్లోనే ఉండే అవకాశం ఉందన్నారు. ఈ నాలుగైదు నెలలు పెట్టుబడిదారులకు ఎంతో కీలకమని సూచించారు. ఏకమొత్తంలో కాకుండా.. విడతలుగా మదుపు చేయడం వల్ల ప్రయోజనం అధికంగా ఉంటుందని పేర్కొన్నారు. ‘2008లో విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (ఎఫ్‌ఐఐ) స్టాక్‌ మార్కెట్‌ నుంచి పెద్ద మొత్తంలో పెట్టుబడులను వెనక్కి తీసుకున్నప్పుడు సూచీలు భారీగా నష్టపోయాయి. ఇప్పుడూ అదే తరహాలో ఎఫ్‌ఐఐలు షేర్ల విక్రయాలు కొనసాగిస్తున్నా.. దేశీయ మదుపరుల పెట్టుబడులు మార్కెట్‌ను నిలబెడుతున్నాయి. భారత్‌ కంపెనీలపై మదుపరులకు ఉన్న నమ్మకాన్ని ఇది చాటి చెబుతోంది’ అని పేర్కొన్నారు. అంతర్జాతీయ ఫండ్లలో పెట్టుబడులపై సెబీ ఆంక్షలు తొలగిపోయినందున, పెట్టుబడిదారులు వైవిధ్యం కోసం వీటిని పరిశీలించవచ్చని తెలిపారు. ఎన్‌ఎఫ్‌ఓలపైనా జూన్‌ 30 వరకు నిషేధం ఉందని, ఆ తర్వాత వరుసగా ఎన్‌ఎఫ్‌ఓలు వస్తాయని పేర్కొన్నారు. ఐపీఓల్లో మదుపు చేసేటప్పుడు కంపెనీల దీర్ఘకాలిక వృద్ధిని పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని