మనసులు గెలిచాడు... మహాత్ముడయ్యాడు!

కొందరంతే. వారితో పరిచయం తర్వాత జీవితం మునపటిలా ఉండదు. నడక మారుతుంది. నడత మారుతుంది. మొత్తంగా వ్యక్తిత్వమే మారిపోతుంది. గాంధీజీ కూడా అందుకు అతీతులు కారు. కొందరిని కలిసి తాను మారారు. మరికొందరు ఆయన్ని చూసి మారిపోయారు. దేశ చరిత్రగతినే మార్చేసిన బాపూ తొలి పరిచయాల కథలివి.

Updated : 02 Oct 2022 08:26 IST

మనసులు గెలిచాడు... మహాత్ముడయ్యాడు!

కొందరంతే. వారితో పరిచయం తర్వాత జీవితం మునపటిలా ఉండదు. నడక మారుతుంది. నడత మారుతుంది. మొత్తంగా వ్యక్తిత్వమే మారిపోతుంది. గాంధీజీ కూడా అందుకు అతీతులు కారు. కొందరిని కలిసి తాను మారారు. మరికొందరు ఆయన్ని చూసి మారిపోయారు. దేశ చరిత్రగతినే మార్చేసిన బాపూ తొలి పరిచయాల కథలివి.

 రోజుల్లో చాలామంది సంపన్న కుటుంబాల్లో పిల్లల్లాగే గాంధీజీ కూడా ఇంగ్లాండ్‌ వెళ్లి బారిష్టరు చదివారు. లా ప్రాక్టీసు చేయడానికి దక్షిణాఫ్రికా వెళ్లి రెండు దశాబ్దాలకు పైగా అక్కడే ఉండిపోయారు. నలభయ్యారేళ్ల వయసులో ఆయన తిరిగి భారత్‌కి వచ్చేసరికే- ఇక్కడ కాంగ్రెస్‌ ఉంది... ప్రజల్లో జాతీయ భావన పాదుకొంది...  ఎందరో నాయకులు ఉన్నారు... వలస పాలనకు వ్యతిరేకంగా ఉద్యమాలు జరుగుతున్నాయి...

అయినా ఆయనకు ఘనస్వాగతం పలికింది దేశం. నీకోసమే ఎదురుచూస్తున్నామన్నారు నాయకులంతా. ఇక్కడ ఇంతమంది సీనియర్లు ఉండగా ఎక్కడినుంచో వచ్చిన ఆయనెవరు... అనలేదు ఎవరూ..! దాదాభాయ్‌ నౌరోజీ, గోపాల కృష్ణ గోఖలే, బాలగంగాధర తిలక్‌... తదితరులంతా గాంధీకన్నా పెద్దవాళ్లు. అప్పటికే తమదైన శైలిలో పరాయి పాలనను ప్రశ్నిస్తున్న వాళ్లు... స్వాతంత్య్ర ఉద్యమాన్ని నడిపిస్తున్నవాళ్లు. అయినా సరే... ఉద్యమ సారథ్యాన్ని ఆయనకు అప్పగించడానికి సంసిద్ధమయ్యారు.

నెహ్రూ, పటేల్‌, సరోజినీ నాయుడు, సుభాష్‌ చంద్రబోస్‌, లాల్‌ బహదూర్‌ శాస్త్రి... తదితరులంతా ఆయనకన్నా చిన్నవాళ్లు. ఉద్యమంలో అతివాద, మితవాద ధోరణులను గమనిస్తూ సరైన మార్గదర్శకత్వం కోసం వేచి చూస్తున్నవాళ్లు.

ఈ రెండుతరాల వారినీ తనవైపు తిప్పుకున్నారు గాంధీజీ. చురుకైన ఆ చూపులూ ఆత్మవిశ్వాసం ప్రస్ఫుటించే ఆ నడకా నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి ఉండే ఆ పట్టుదలా ఎదుటివారిని మెస్మరైజ్‌ చేసేవి. ఎంతటి మహామహులైనా సూటిగా స్పష్టంగా వచ్చే ఆ మాటల మాయలో పడాల్సిందే. అలాగని ఆయనేం నిరంకుశులు కాదు. పెద్దల దగ్గర ఒద్దికగా నేర్చుకున్నారు. పిన్నలను చేయిపట్టి నడిపించారు. గాంధీజీని మహాత్ముడిగా మలచిన ఆ పరిచయాలు ఎవరివీ అంటే...  

గాంధీజీ మెచ్చిన ‘జాతిపిత’

జాతిపిత అనగానే మనకు గాంధీ గుర్తొస్తారు కానీ, నిజానికి గాంధీజీనే స్వయంగా మరొకరిని ‘భారత జాతిపిత’ అని పిలుచుకునేవారు. ఆయనే- ‘గ్రాండ్‌ ఓల్డ్‌ మ్యాన్‌ ఆఫ్‌ ఇండియా’ అని పేరొందిన పార్సీ మేధావీ రాజకీయ నాయకుడూ అయిన దాదాభాయి నౌరోజీ. సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా విన్పించిన మొదటి గొంతు ఆయనదే. భారత జాతీయ కాంగ్రెస్‌ సహ వ్యవస్థాపకులూ జాత్యహంకారాన్ని అధిగమించి బ్రిటిష్‌ హౌస్‌ ఆఫ్‌ కామన్స్‌కి ఎన్నికైన తొలి ఆసియావాసీ ఆయనే. ఎందరో భారతీయ విద్యార్థుల్ని ఆయన ప్రోత్సహించారు. జాతీయవాదులుగా మార్చారు. సామ్రాజ్యవాదం ఏ విధంగా వనరుల దోపిడీకి దారితీస్తోందో అందరికీ అర్థమయ్యేలా చెప్పగలిగారాయన. దేశంలో తరచూ సంభవిస్తున్న కరవు కాటకాలకూ పెరుగుతున్న పేదరికానికీ అదే కారణమంటూ పుస్తకాలు రాశారు. భారతదేశం ‘స్వరాజ్‌’ను కోరుకుంటోందంటూ  ఆయనిచ్చిన పిలుపు ప్రపంచదేశాలన్నిటా మార్మోగింది. అదే గాంధీజీని చకితుణ్ణి చేసింది. ‘భారత జాతీయవాదానికి సృష్టికర్త’ అనీ ‘జాతిపిత’ అనీ పేర్కొంటూ గాంధీ నౌరోజీని కొనియాడారు. ఆయనే కనుక ప్రజల్ని అలా సిద్ధం చేయకపోయినట్లయితే ఇక్కడి యువతరం నోటి వెంట ‘స్వయం పాలన’ అన్న మాట రావడానికి ఇంకెన్నేళ్లు పట్టేదో... అనేవారు గాంధీజీ.

గాంధీ లండన్‌లో లా చదువుతున్నప్పుడే మొదటిసారి నౌరోజీని చూశారు. ఆయన ప్రసంగాలు విన్నారు. రచనలను చదివారు. దక్షిణాఫ్రికాకి వెళ్లాక కూడా తన ఛాంబర్‌లో ఎదురుగా నౌరోజీ నిలువెత్తు చిత్రాన్ని పెట్టుకున్నారు. అక్కడి ప్రవాస భారతీయుల హక్కులకోసం పోరాడే క్రమంలో సలహాలూ మార్గదర్శకత్వం కోరుతూ తరచూ నౌరోజీకి ఉత్తరాలు రాసేవారు. సామర్థ్యానికి మించి బాధ్యతలను తలకెత్తుకున్నాననీ, ఎలాంటి సలహా ఇచ్చినా ఒక కుమారుడిలా దాన్ని శిరసావహిస్తాననీ ఉత్తరాల్లో చెప్పేవారు. గాంధీ సేవాతత్పరతను అర్థం చేసుకున్న నౌరోజీ కూడా ఆయనకు అండగా నిలిచేవారు. గాంధీజీ కోరిక మేరకు ట్రాన్స్‌వాల్‌లో భారతీయుల సమావేశాలకు హాజరయ్యారు. గాంధీజీ దృష్టిలో నౌరోజీ నిజమైన దేశభక్తుడు. ఆయన గురించి ఎన్ని వ్యాసాలు రాసినా గాంధీకి తనివి తీరేది కాదు. స్వతంత్ర భారతంలో ఉచిత నిర్బంధ విద్య అవసరం గురించీ స్త్రీ విద్య, సమానహక్కుల గురించీ ఆనాడే మాట్లాడిన ఆధునికవాది నౌరోజీ. సతీసహగమనం, బాల్యవివాహాలకు వ్యతిరేకంగా గాంధీ మాట్లాడడానికీ పలువురు మహిళలను రాజకీయాల్లో ప్రోత్సహించడానికీ నౌరోజీ ప్రభావమే కారణం.

దేశమంతా తిరగమన్నారు..!

దక్షిణాఫ్రికాలో ప్రవాస భారతీయుల హక్కుల కోసం పోరాడుతున్న గాంధీని స్వదేశానికి రప్పించిన ఘనత గోపాలకృష్ణ గోఖలేది. 1896లో మొదటిసారి గాంధీని చూశారాయన. దక్షిణాఫ్రికాలో ఆయన కార్యక్రమాల గురించి తెలుసుకుంటూనే ఉన్నారు. 1901లో కలకత్తా కాంగ్రెస్‌ సమావేశానికి హాజరయ్యారు గాంధీ. ఆ సమావేశం తర్వాత ఇద్దరూ ఓ నెలరోజులు కలిసి గడిపారు. అప్పుడే గాంధీని స్వదేశానికి వచ్చి స్వాతంత్య్రం కోసం పోరాడాల్సిందిగా కోరారు గోఖలే. అంతటితో ఊరుకోలేదు, గాంధీకి లాయరుగా పని ఇవ్వమని కోరుతూ ముంబయిలో పలువురు ప్రముఖ లాయర్లకు సిఫార్సు లేఖలూ రాసిచ్చారు. కానీ దక్షిణాఫ్రికాలో పనులు గాంధీని తిరిగి వెళ్లిపోయేలా చేశాయి. అయితే అక్కడికి వెళ్లినా గోఖలే శిష్యరికం మానలేదు గాంధీ. న్యాయపరంగా, నిధులపరంగా ఏ సాయం అవసరమైనా గోఖలే వైపే చూసేవారు. ఆయన తోడ్పాటే లేకపోతే దక్షిణాఫ్రికాలో చాలా సమస్యలు తాను పరిష్కరించలేక పోయేవాడినంటారు గాంధీజీ. అందుకే గోపాలకృష్ణ గోఖలేని తన గురువుగానూ మార్గదర్శిగానూ చెప్పుకునేవారు. 1915లో భారతదేశానికి తిరిగి వచ్చినప్పుడు రాజకీయాల్లో క్రియాశీలంగా పని మొదలుపెట్టడానికి ముందు ఏడాదిపాటు దేశమంతా పర్యటించమని ఆయనకి సలహా ఇచ్చారు గోఖలే. అందుకు అవసరమైన నిధులూ సమకూర్చారు. ఆయన సూచన మేరకే రైల్లో మూడో తరగతిలో ప్రయాణిస్తూ భారతదేశ ప్రజల పరిస్థితులను అర్థం చేసుకోడానికి బయల్దేరారు గాంధీ. దక్షిణాఫ్రికాలో భారతీయులతో కలిసి పనిచేసినా వారంతా కులమత భేదాలను అధిగమించి ప్రవాసభారతీయులుగా తమ హక్కుల కోసం ఒక్కతాటిమీదికి వచ్చినవారు. ఇక్కడ అలా కాదు. కులం, మతం, భాష... ప్రజలమధ్య ఎన్నో అవరోధాలు. వాటిని తెలుసుకోవడానికి గాంధీకి సమయం పట్టింది. దేశమంతా తిరగమని గోఖలే ఎందుకు చెప్పారో అప్పుడు అర్థమైంది. ముంబయి నుంచి మొదలుపెట్టి దేశం నలువైపులా ప్రయాణించారు. ప్రజలతో మమేకమయ్యారు. గాంధీ దేశాటనంలో ఉండగానే గోఖలే కన్నుమూశారు.

నిమిషం కూడా వృథాగా గడపని గోఖలే పనితీరును అబ్బురంగా చూసేవారు గాంధీజీ. గాంధీకన్నా మూడేళ్లే పెద్దవాడైనప్పటికీ గోఖలే ఆరోగ్యం ఏమాత్రం బాగుండేది కాదు. అది చూసి గాంధీ బాధపడేవారు. గోఖలే అనారోగ్యానికి కారణం శారీరక వ్యాయామం లేకపోవడమేనని భావించిన గాంధీజీ దానికి సమయం కేటాయించమనీ, ఆరోగ్యంగా ఉంటే మరింతగా దేశసేవ చేయొచ్చనీ చెప్పేవారు. ఆయన నవ్వి ఊరుకునేవారు. గోఖలే నిస్వార్థం, త్యాగశీలత, నిర్భయత్వం... గాంధీ వ్యక్తిత్వంపై చెరగని ముద్ర వేశాయి. ‘ధర్మాత్మా గోఖలే’ పేరుతో ఓ పుస్తకం కూడా రాశారు గాంధీ.

శాంతినికేతనాన్ని మార్చిన భేటీ

1915 మార్చిలోనే శాంతినికేతన్‌లో తొలిసారి రవీంద్రనాథ్‌ టాగూర్‌ని కలిశారు గాంధీజీ. ఆ సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ ఇప్పటికీ మార్చి 10న శాంతినికేతన్‌లో ‘గాంధీ డే’ని నిర్వహిస్తారు. ఆరోజున వంటవారితో సహా అక్కడ పని చేసేవారంతా సెలవు తీసుకుంటారు. విద్యార్థులూ అధ్యాపకులూ తమ పనులను స్వయంగా చేసుకుంటారు. అందుకు కారణం ఉంది... టాగూర్‌ని కలవడానికి వెళ్లిన గాంధీజీ శాంతినికేతన్‌లో ఒక వారం బస చేశారు. అప్పుడు ఫీనిక్స్‌ ఆశ్రమంలో తాము ప్రవేశపెట్టిన ‘అందరూ కలిసి అన్ని పనులూ చేసుకోవడం’ అనే విధానాన్ని శాంతినికేతన్‌కీ పరిచయం చేశారు. ఆ విధానం అక్కడి వారికి ఎంతో నచ్చి చాలాకాలం దాన్ని అనుసరించారు.

టాగూర్‌ అప్పటికే విశ్వకవిగా ప్రపంచం ఎరిగిన ప్రముఖులు. గాంధీనేమో దక్షిణాఫ్రికాలో భారతీయుల సత్తా ఏమిటో చూపి  కాంగ్రెస్‌లోకి కొత్తగా వచ్చిన వ్యక్తి... వీరిద్దరి తొలి సమావేశం ఎలా ఉండబోతోందోనన్న ఆసక్తితో శాంతినికేతన్‌కి గాంధీ వెనకాల పలువురు బయల్దేరి వెళ్లారు. వీళ్లు వెళ్లేసరికి టాగూర్‌ సోఫాలో కూర్చుని వున్నారు. గాంధీని చూడగానే లేచి సాదరంగా ఆహ్వానించారు. చేతులు పట్టుకుని తన పక్కన కూర్చోబెట్టుకునే ప్రయత్నం చేశారు. కానీ కింద కూర్చోవడానికే ఇష్టపడే గాంధీ ఆయన్ని సున్నితంగా వారించి కింద తివాచీ మీద చేరగిలబడ్డారు. దాంతో రవీంద్రుడికీ కింద కూర్చోక తప్పలేదు. క్షేమ సమాచారాలతో మొదలెట్టి దేశ పరిస్థితుల వరకూ వారిమధ్య ఎన్నో విషయాలు చర్చకు వచ్చాయి. ఆ తర్వాత పాతికేళ్లపాటు ఇద్దరి మధ్యా ఉత్తరప్రత్యుత్తరాల్లో సిద్ధాంత చర్చలు నడుస్తూనే ఉండేవి. ‘తొలి పరిచయంలో మా ఇద్దరి మధ్య ఏదో భావసంఘర్షణ ఉంటుందనుకున్నాను కానీ అలాంటిదేమీ జరగలేదు’ అని రాసుకున్నారు గాంధీ. నిజానికి వ్యక్తిత్వాల రీత్యా ఇద్దరూ భిన్నధ్రువాలు. ఒక్కోసారి గాంధీజీ అశాస్త్రీయ ధోరణిని టాగూర్‌ ముక్కుసూటిగా విమర్శించేవారు. అయితే చర్చల ద్వారా ఆ అభిప్రాయభేదాలను అధిగమించేవారు. దేశమే మొదటి ప్రాధాన్యమయ్యేది ఇద్దరికీ. పరస్పరం భిన్నాభిప్రాయాలు ఉన్నా ఒకే ఆశయం కోసం పని చేసేటప్పుడు అవి అడ్డురావని రుజువు చేస్తుంది వీరిద్దరి స్నేహం. గాంధీ ఎరవాడ జైలులో ఉన్నప్పుడు నిరాహారదీక్ష చేపట్టగా ఆయన ఆరోగ్యం గురించి ఆందోళన చెందిన టాగూర్‌ స్వయంగా జైలుకు వచ్చి పరామర్శించారు. 1940లో గాంధీ కస్తూర్బాతో కలిసి శాంతినికేతన్‌కి వెళ్లినప్పుడు తన తర్వాత సంస్థ బాధ్యతలు చేపట్టాల్సిందిగా గాంధీని కోరారు టాగూర్‌. తనకా అర్హత లేదని సున్నితంగా చెప్పారట గాంధీజీ. ఆయన్ని ‘మహాత్మా’ అని తొలిసారి పిలిచింది రవీంద్రనాథ్‌ టాగూర్‌ కాగా టాగూర్‌ని గురుదేవులని సంబోధించి చివరివరకూ అలాగే గౌరవించారు గాంధీజీ.

ఇలా అప్పటి నాయకులను కలుసుకుంటూ వారినుంచి తనకు అవసరమైనది నేర్చుకుంటూ దేశ పరిస్థితుల్ని అర్థం చేసుకుంటూ తనదైన శైలిలో ముందుకు సాగుతున్న గాంధీజీ నిరాడంబర వ్యక్తిత్వం నాటి యువతరాన్నీ ఆకట్టుకుంది. అప్పటివరకూ ప్రేక్షకుల్లా దూరం నుంచి ఉద్యమాన్ని గమనిస్తూ ఉన్నవారంతా మెల్లమెల్లగా దాంట్లో భాగస్వాములు కావడం మొదలెట్టారు. గాంధీజీలో తమ నాయకుడిని చూసుకున్నారు. అలా మూడు దశాబ్దాలకు పైగా ఆయనతో కలిసి నడిచి స్వతంత్ర భారతానికి రాష్ట్రపతిగా, ప్రధానిగా, హోంమంత్రిగా చరిత్ర సృష్టించిన వారి పరిచయానికి వస్తే...

ఆ ఆకర్షణే చివరివరకూ...

1916 డిసెంబరులో గాంధీని మొదటిసారి కలిశారు జవహర్‌లాల్‌ నెహ్రూ. లఖ్‌నవూలో జరుగుతున్న జాతీయ కాంగ్రెస్‌ సదస్సుకి ఇరవై ఏడేళ్ల నెహ్రూ తండ్రితో కలిసి వెళ్లారు. మోతీలాల్‌ కాంగ్రెస్‌లో ప్రముఖ నాయకులు. సంపన్నుడూ స్ఫురద్రూపీ. గంభీరంగా ఉపన్యసించేవారు. సహజంగానే నెహ్రూకి తండ్రి పట్ల ఆరాధనాభావం ఉండేది. ఆ సమావేశాల్లో మొదటిసారి కొడుక్కి గాంధీని పరిచయం చేశారు మోతీలాల్‌. ముతక దుస్తుల్లో తండ్రి పక్కన నిలబడిన ఆయనకు అన్యమనస్కంగానే నమస్కరించారు నెహ్రూ. అక్కడ ఉన్న నాయకులంతా గాంధీజీ దక్షిణాఫ్రికా పోరాటాల గురించి కథలు కథలుగా చెబుతోంటే- ఆయన మాత్రం ఆ ప్రశంసలేవీ పట్టించుకోకుండా నిర్లిప్తంగా ఉండడాన్ని గమనించారు. నిరాడంబరంగా కన్పించే ఆ మనిషిలో ఏదో ఆకర్షణ ఉందనిపించింది కానీ అదేమిటో తెలియడానికి కొంతసమయం పట్టిందని తన జీవితచరిత్రలో రాసుకున్నారాయన. కాంగ్రెస్‌ సదస్సులో పాల్గొన్నప్పటికీ కాంగ్రెస్‌ పట్ల ఏమాత్రం ఆసక్తిలేనట్లుగా ఉండడంతో తాము గాంధీజీని అంతగా పట్టించుకోలేదనీ, కానీ ఆ తర్వాత చంపారన్‌లో ఆయన సాధించిన విజయం తనలాంటి యువకులందరిలో ఉత్సాహాన్ని నింపిందనీ పేర్కొన్నారు. స్వాతంత్య్రం కోసం పోరాడక తప్పదని తెలిసినా ఆ పోరాటం ఏ దిశగా సాగాలో తెలియని అయోమయంలో ఉన్న తమకు గాంధీజీ చెప్పిన సత్యాగ్రహ మార్గం నచ్చిందనీ మరో ఆలోచన లేకుండా ఆయన వెంట నడిచామనీ రాశారు నెహ్రూ. తమ ఇద్దరి మధ్యా బంధం ఒక్క రోజులో ఏర్పడింది కాదనీ ఒక్కో సమావేశంతో అది బలపడుతూ గాంధీ గురించి ఒక్కో కొత్త విషయం తెలుసుకునేలా చేసిందనీ, తొలిరోజు ఆయన్ని చూసినప్పుడు కన్పించిన ఆకర్షణ మాత్రం చివరివరకూ అలాగే కొనసాగిందనీ రాసుకున్నారు నెహ్రూ.

అనుకోకుండా ఆ గొంతు విని...

1916 లోనే ఓ రోజు... గుజరాత్‌ క్లబ్‌లో ఎప్పటిలాగే స్నేహితులతో కలిసి సిగరెట్లు తాగుతూ బ్రిడ్జి ఆడుతూ సరదాగా సమయం గడుపుతున్నారు వల్లభ్‌భాయ్‌ పటేల్‌. ఆ సమయంలోనే దేశాటనం చేస్తూ సమావేశాల్లో ప్రసంగిస్తున్న గాంధీజీ గురించి ప్రస్తావన వచ్చింది. ‘నువ్వు గాంధీ ప్రసంగం వినాలి’ అన్నారు వల్లభ్‌భాయ్‌ స్నేహితుడైన చిమన్‌లాల్‌ ఠాకూర్‌. పటేల్‌కి ఏమాత్రం ఆసక్తి అనిపించలేదు. కానీ అనుకోకుండా అదే రోజు క్లబ్‌ నిర్వాహకులు గాంధీని క్లబ్‌కి ఆహ్వానించారు. గాంధీ ప్రసంగిస్తున్నారు. పటేల్‌ సిగరెట్ తాగుతూ తన కేసులూ లావాదేవీల గురించి ఆలోచించుకుంటూ వెనకాల ఎక్కడో కూర్చున్నారు. వద్దన్నా గాంధీ మాటలు చెవుల్లో దూరుతున్నాయి. మెల్లగా ఆసక్తి పెరిగింది. ఈయనేదో మంచి విషయమే చెబుతున్నారే అనుకున్నారట. నిజానికి అప్పటివరకూ పటేల్‌కి తన కేసులూ క్లయింట్లూ తప్ప దేశం గురించిన ఆలోచన లేదు. హింసా అహింసల గురించి పట్టించుకోనేలేదు. కానీ ఒకసారి గాంధీ మాటలు విన్నాక వద్దన్నా ఆ ఆలోచనలు అతడిని వదిలేవి కావు. ఒక సిద్ధాంతాన్ని నమ్మి, దేశ స్వాతంత్య్రం కోసం జీవితాన్ని అంకితం చేసిన మనిషిగా గాంధీ పట్ల ఆయనకి గౌరవం పెరిగింది. అదే సమయంలో వరదలు రావడంతో పంటలు నష్టపోయిన రైతుల పరిస్థితి గురించి నివేదిక ఇవ్వడానికి నిజనిర్ధారణ సంఘంలో సభ్యుడిగా పటేల్‌ అక్కడికి వెళ్లారు. రైతుల స్థితి ఆయన్ని కదిలించింది. గాంధీమార్గంలో పోరాడమని వారికి సూచించిన పటేల్‌ ఇక ఆ తర్వాత తానే గాంధేయవాదిగా మారిపోయారు. సూటూబూటూ వదిలేసి ఖద్దరు ధరించి వెళ్లి గాంధీని కలిశారు. గుజరాత్‌ సభకు అధ్యక్ష, కార్యదర్శులుగా ఇద్దరూ కలిసి ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారు. ఎలాంటి పరిస్థితిలోనైనా సరదాగా వ్యాఖ్యానించి గాంధీని నవ్విస్తూ ఆయనకు కుడిభుజంలా వ్యవహరించేవారు సర్దార్‌ పటేల్‌.

ఊహించని పరిణామం

పట్నా హైకోర్టులో న్యాయవాదిగా మంచి పేరూ సంపాదనా ఉండేది డాక్టర్‌ రాజేంద్రప్రసాద్‌కి. వృత్తే ప్రపంచంగా ఇంకా మంచి పేరు తెచ్చుకోవడానికి కష్టపడేవారు. ఓసారి ఏదో పనిమీద రాజేంద్రప్రసాద్‌ని కలవడానికి ఆయన ఇంటికి వెళ్లారు గాంధీ. ఆయనేమో ఊరెళ్లారు. గాంధీ వేషధారణ చూసిన నౌకరు ఆయన్ని పల్లెటూరి కక్షిదారు ఎవరో అనుకుని సామాన్ల గదిలో కూర్చోబెట్టాడట. ప్రసాద్‌ ఊళ్లో లేరనీ, గాంధీజీ వచ్చి ఉన్నారనీ తెలిసిన కాంగ్రెస్‌ నాయకుడు ఒకరు హడావుడిగా వెళ్లి గాంధీని తన ఇంటికి తీసుకెళ్లాడు. తిరిగి వచ్చాక విషయం తెలిసి నౌకరును తిట్టిన రాజేంద్రప్రసాద్‌ గాంధీని కలిసి క్షమాపణ చెప్పుకోవాలనుకున్నారు. కానీ పనిలో పడి ఆ విషయమే మర్చిపోయిన రాజేంద్రప్రసాద్‌ గాంధీతో తొలి పరిచయం అవకాశాన్ని కోల్పోయారు. కాంగ్రెస్‌ కార్యక్రమాల్ని గమనిస్తున్నారే తప్ప అందులో పాల్గొనాలని ఎప్పుడూ అనుకోలేదు. తోటివారు ఆహ్వానించినా తనకి కుదరదని తోసిపుచ్చేవారు. చంపారన్‌లో రైతుల ఉద్యమం జరుగుతున్నప్పుడు అక్కడికి గాంధీజీ వస్తున్నారనీ ఆయనకు హిందీ అంత బాగా రాదు కాబట్టి సహాయంగా కొందరు న్యాయవాదుల్ని అక్కడికి వెళ్లమనీ కోరారు నాయకులు. గాంధీజీ కూడా న్యాయవాదే కాబట్టి ఆయనతో న్యాయశాస్త్రానికి సంబంధించిన సంగతులు మాట్లాడుకోవచ్చని భావించిన రాజేంద్రప్రసాద్‌ చంపారన్‌ వెళ్లారు. కానీ విచిత్రంగా గాంధీ కెరీర్‌ గురించి ఏమీ మాట్లాడకపోగా ‘త్యాగాలకు సిద్ధంగా ఉన్నావా’ అని ప్రశ్నించారు. అది ఆయనకి ఊహించని ప్రశ్న. ఒకటి రెండు రోజులకోసమని చంపారన్‌ వెళ్లిన రాజేంద్రప్రసాద్‌ సమస్య పరిష్కారమయ్యేవరకూ కొన్ని నెలలపాటు అక్కడే ఉండిపోయారు. కోర్టూ కేసులూ అన్నీ మర్చిపోయి దేశం గురించి ఆలోచించడం మొదలెట్టారు. గాంధీ సాహచర్యమే తన ఆలోచనల్లో మార్పుకి కారణమని గుర్తించిన ఆయన ఇక వెనుదిరిగి చూడలేదు. స్వాతంత్య్రోద్యమంలో మనస్ఫూర్తిగా పాల్గొనడానికే కాదు, తొలి రాష్ట్రపతిగా సగం జీతమే తీసుకోవడానికి స్ఫూర్తి కూడా గాంధీజీనే అని గర్వంగా చెప్పేవారాయన.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..