logo

హైదరాబాద్ వార్తలు

Short News

జూబ్లీహిల్స్‌, న్యూస్‌టుడే: కోటి రూపాయల వజ్రాభరణాలు మాయమైన సంఘటన జూబ్లీహిల్స్‌ ఠాణా పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబరు 71లోని నవనిర్మాణ్‌నగర్‌లో నివసించే విశ్రాంత ఉద్యోగి బాబ్జి రెండు నెలల క్రితం భార్యతో కలిసి బెంగళూరులో నివసించే తమ కూతురు ఇంటికి వెళ్లారు. ఈ నెల 20న మూడు డైమండ్‌ నెక్లెస్‌లు, 3జతల వజ్రపు చెవిదిద్దుల సంచితో కూడిన ఒక క్యాబిన్‌ లగేజీతోపాటు మరో సూట్‌కేస్‌ తీసుకొని నగరానికి వచ్చారు. విమానాశ్రయంలో పోలీసుశాఖ ఆధ్వర్యంలో కొనసాగే ప్రీపెయిడ్‌ టాక్సీ ద్వారా సామగ్రిని డిక్కీలో పెట్టుకొని జూబ్లీహిల్స్‌కు బయలుదేరారు. ఇంటికి వచ్చే క్రమంలో ఫిలింనగర్‌లోని దైవసన్నిధానం ఎదురుగా ఉన్న విజేత సూపర్‌మార్కెట్‌ వద్ద కారు నిలిపారు. బాబ్జి మార్కెట్‌కు వెళ్లగా, అతని భార్య కారులో కూర్చొంది. డ్రైవర్‌ కారును శుభ్రం చేసుకున్నాడు. కొద్ది సమయం తరువాత వారు ఇంటికి చేరుకోగా డ్రైవరు లగేజీని తీసుకొచ్చి ఇంట్లో పెట్టాడు. బుధవారం సూట్‌కేస్‌లు తెరిచి చూడగా అందులో ఉండాల్సిన వజ్రాభరణాల సంచి కనిపించలేదు. వీటి విలువ సుమారు రూ.కోటి ఉంటుందని, డ్రైవర్‌పై అనుమానం వ్యక్తం చేస్తూ బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

సాంఘిక సంక్షేమ విద్యార్థుల మెరుపులు
  రాయదుర్గం, న్యూస్‌టుడే: గౌలిదొడ్డి సాంఘిక సంక్షేమ జూనియర్‌ కళాశాల విద్యార్థులు జేఈఈ మెయిన్స్‌లో ఉత్తమ పర్సంటైల్‌తోపాటు ర్యాంకులు సాధించారు. సాయిరామ్‌ 99.67 పర్సంటైల్‌తో 1277వ ర్యాంకు తెచ్చుకుని కళాశాల టాపర్‌గా నిలిచారు. యూ.వెంకటేశ్‌ 99.31 పర్సంటైల్‌తో 236(ఎస్సీ కేటగిరీ) ర్యాంకు సాధించారు. లక్ష్మికాంత్‌రెడ్డి 98.98 పర్సంటైల్‌తో 2435, సి.ప్రణేష్‌ 98.81 పర్సంటైలతో 4746వ ర్యాంకు, జాడి రేవంత్‌ 98.67 పర్సంటైల్‌ 537(ఎస్సీ కేటగిరీ), కె.లవణ్‌కమార్‌ 98.06 పర్సంటైల్‌ 8358 ర్యాంకులు సాధించారు.

భాజపాకు ఎంత దూరమో.. ఎంఐఎంకూ అంతే దూరం
చంచల్‌గూడ, న్యూస్‌టుడే: లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌.. భాజపాకు ఎంత దూరమో, ఎంఐఎంకు అంతే దూరమని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌ అలీ అన్నారు. హైదరాబాద్‌  నుంచి పోటీ చేస్తున్న పార్టీ అభ్యర్థి మహమ్మద్‌ వలియుల్లా సమీర్‌ ఎన్నికల కార్యాలయాన్ని  చాదర్‌ఘాట్‌లో గురువారం రాత్రి ఏఐసీసీ కార్యదర్శి రోహిత్‌ చౌదరితో కలిసి ప్రారంభించారు.

కాంగ్రెస్‌ ఛార్జిషీట్‌ అబద్ధాల పుట్ట: భాజపా
గన్‌ఫౌండ్రి, న్యూస్‌టుడే: అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌ ఇచ్చిన ఆరు గ్యారెంటీల గురించి పట్టించుకోకుండా భాజపాపై ఛార్జిషీటు విడుదల చేయడం సిగ్గుచేటని మాజీ ఎమ్మెల్సీ, భాజపా సీనియర్‌ నేత ఎన్‌.రాంచందర్‌రావు విమర్శించారు. కాంగ్రెస్‌ విడుదల చేసిన ఛార్జిషీటు అబద్ధాల పుట్ట అని దుయ్యబట్టారు. గురువారం నాంపల్లిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో  విలేకరుల సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్‌ ఎస్‌.ప్రకాశ్‌రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్‌లతో కలసి ఆయన మాట్లాడారు.

ఫిలింనగర్‌, న్యూస్‌టుడే: అపోలో హాస్పిటల్స్‌ గ్రూప్‌ అత్యధిక జాయింట్‌ కమిషన్‌ ఇంటర్నేషనల్‌ (జేసీఐ) అక్రిడిటేషన్లను కలిగిన అతిపెద్ద హాస్పిటల్‌ నెట్‌వర్క్‌గా అవతరించిందని అపోలో హాస్పిటల్స్‌ గ్రూప్‌ గురువారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. ప్రపంచ ఆరోగ్య సంరక్షణ ప్రమాణాలను చేరుకోవడంలో జేసీఐ అక్రిటిటేషన్‌ వైపు ప్రయాణం 2005లో దిల్లీలో ప్రారంభమైందని తెలిపారు. అప్పటి నుంచి వివిధ ప్రదేశాల్లో ఉన్న అపోలో హాస్పిటల్స్‌ ఆరోగ్య సంరక్షణకు కృషి చేస్తున్నాయని గ్రూప్‌ వైస్‌ ఛైర్‌పర్సన్‌ ప్రీతారెడ్డి తెలిపారు. ప్రతిష్ఠాత్మకమైన జేసీఐ అక్రిటిటేషన్‌ను ఏడోసారి అందుకోవడం గౌరవంగా భావిస్తున్నామన్నారు.

అంబర్‌పేట, న్యూస్‌టుడే: డాక్టర్‌ రెడ్డీస్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని యువతీ, యువకులకు ఎలక్ట్రిక్‌ వాహనాల సర్వీస్‌, మెయింటెనెన్స్‌ టెక్నీషియన్‌గా రెణ్నెల్ల పాటు ఉచిత శిక్షణ ఇస్తామని సీనియర్‌ మేనేజర్‌ రాఘవేందర్‌రావు తెలిపారు. శుక్రవారం అంబర్‌పేటలో ఆయన మాట్లాడారు. 18-28 ఏళ్లలోపు వయసు కలిగి.. ఐటీఐ, డిప్లొమాలో ఎలక్ట్రికల్‌, మెకానికల్‌, ఆటోమొబైల్‌ కోర్సులు పూర్తిచేసిన వారు శిక్షణకు అర్హులని పేర్కొన్నారు. పేర్ల నమోదుకు 91541 69212, 96036 90068 ఫోన్‌ నంబర్లలో సంప్రదించాలని సూచించారు.

హబ్సిగూడ, న్యూస్‌టుడే: ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్‌ కళాశాలల్లో డిప్లొమా ఇన్‌ ఇంజినీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశాలు పొందేందుకు పాలిసెట్‌-2024 దరఖాస్తులకు ఈనెల 28 వరకు పొడగించారని మేడ్చల్‌ జిల్లా పాలిసెట్‌ సమన్వయాధికారి వినయ్‌కుమార్‌ తెలిపారు. రూ.100 ఆలస్య రుసుంతో ఈనెల 30వరకు, రూ.300 ఆలస్య రుసుంతో మే 20వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. పదో తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులు sbtet.telangana.gov.in లో దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు.

కాచిగూడ, న్యూస్‌టుడే: వేసవిలో ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో.. కాచిగూడ-హిసార్‌ మధ్య 18 ప్రత్యేక రైళ్లను మే 2 నుంచి జూన్‌ 30 వరకు నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ముఖ్య పౌరసంబంధాల అధికారి సీహెచ్‌ రాకేష్‌ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మే 2 నుంచి జూన్‌ 27 వరకు కాచిగూడ-హిసార్‌(07055) రైలు ప్రతి గురువారం మధ్యాహ్నం 3.15కు కాచిగూడలో బయలుదేరి శనివారం ఉదయం 11.15 గంటలకు హిసార్‌ చేరుకుంటుందన్నారు. మే 5 నుంచి జూన్‌ 30 వరకు హిసార్‌-కాచిగూడ(07056) రైలు ప్రతి ఆదివారం ఉదయం 12.35 గంటలకు హిసార్‌లో బయలుదేరి కాచిగూడకు మంగళవారం ఉదయం 7.30 గంటల కల్లా వస్తుందని వెల్లడించారు.

ఈనాడు, మహబూబ్‌నగర్‌: పాలమూరులోని మహబూబ్‌నగర్‌ పార్లమెంటు స్థానానికి మొత్తం 33 మంది అభ్యర్థులు 42 నామినేషన్లు దాఖలు చేశారు. చివరి రోజైన గురువారం భారీగా నామపత్రాలు సమర్పించారు. మధ్యాహ్నం 3 గంటల్లోగా రిటర్నింగ్‌ కార్యాలయాలకు వచ్చిన అభ్యర్థులకు టోకెన్లు ఇచ్చారు. వీరు ఎక్కువ మంది ఉండడంతో నామపత్రాలు వేయడం రాత్రి వరకు కొనసాగింది. ఈ నెల 26న పరిశీలన జరుగుతుంది. 29 వరకు ఉపసంహరణ గడువు ఉంది. అదే రోజు అభ్యర్థుల తుది జాబితా ప్రకటిస్తారు. మే 13న పోలింగ్‌. జూన్‌ 4న ఓట్ల లెక్కింపు. నామినేషన్ల ప్రక్రియ పూర్తి కావడంతో ప్రచారం ఊపందుకోనుంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు ఇలా.. : వంశీచంద్‌ రెడ్డి (కాంగ్రెస్‌), డీకే అరుణ (భాజపా), మన్నె శ్రీనివాస్‌ రెడ్డి (భారాస), షేక్‌ మున్నా బాషా (ఏఐఎంఐఎం), జి.రాకేశ్‌ (ధర్మ సమాజ్‌ పార్టీ), శంకర్‌ రెడ్డి (విడుదలై చిరుతైగల్‌ కచ్చి), ఏ. రెహమాన్‌ (బహుజన్‌ ముక్తి పార్టీ), టి.వెంకటేశ్వర్లు (అలయన్స్‌ డెమోక్రసీ రిఫార్మ్స్‌ పార్టీ),   నరేశ్‌రెడ్డి (తెలంగాణ జాగీర్‌ పార్టీ), రవీందర్‌ (సోషల్‌ జస్టిస్‌ పార్టీ), మహ్మద్‌ అల్లాఉద్దీన్‌ (బహుజన్‌ సమాజ్‌ పార్టీ).

రైతులు సంతోషంగా జీవించాలి: స్పీకర్‌
వికారాబాద్‌ గ్రామీణ: రైతులంతా సంతోషంగా జీవించాలని ఆ సంగమేశ్వర స్వామిని కోరినట్లు స్పీకర్‌, వికారాబాద్‌ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్‌కుమార్‌ అన్నారు. మండల పరిధిలోని మదన్‌పల్లి గ్రామంలో జరుగుతున్న సంగమేశ్వర స్వామి ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. పూజలు చేసి అర్చకుల దీవెనలు పొందారు. అనంతరం మాట్లాడుతూ వచ్చే వర్షకాంలో సమృద్ధిగా వర్షాలు కురిసి పాడిపంటలు బాగుండేలా స్వామి దీవెనలు ఉండాలని కోరుకున్నానని తెలిపారు.

జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా సున్నం శ్రీనివాస్‌రెడ్డి
వికారాబాద్‌, న్యూస్‌టుడే: హైదరాబాద్‌ సిటీ సివిల్‌ కోర్టులో విధులు నిర్వహిస్తున్న సున్నం శ్రీనివాస్‌రెడ్డిని జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా ప్రభుత్వం నియమించింది. ఈయన త్వరలో విధుల్లో చేరనున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా విధులు నిర్వహించిన సుదర్శన్‌ను హైదరాబాద్‌లోని కార్మిక న్యాయస్థానం (లేబర్‌ కోర్టు) జడ్జిగా బదిలీ అయ్యారు. గురువారం బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు అశోక్‌కుమార్‌ ఈ విషయాలను తెలిపారు. ఆయన ఆధ్వర్యంలో బదిలీపై వెళ్తున్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి సుదర్శన్‌కు వీడ్కోలు సమావేశం నిర్వహించి సత్కరించారు. న్యాయవాదిగా ప్రస్థానం ప్రారంభించి జిల్లా న్యాయమూర్తి స్థాయికి ఎదిగిన తీరును తన ప్రసంగంలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు న్యాయమూర్తి చంద్రకిషోర్‌, సీనియర్‌ న్యాయమూర్తి డి.బి.శీతల్‌, జూనియర్‌ జడ్జి శ్రీకాంత్‌, అదనపు జూనియర్‌ జడ్జి శృతిదూత, న్యాయవాదులు గోవర్ధన్‌రెడ్డి, సంపూర్ణానంద్‌, వెంకటేష్‌, రఫీ, శంకరయ్య, వెంకటేష్‌ తదితరులు పాల్గొన్నారు.

తాండూరు గ్రామీణ, న్యూస్‌టుడే: ధ్రువపత్రం లేకుండా దివ్యాంగ కోటాలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా కొనసాగుతున్న వ్యక్తిపై విచారణ నివేదిక సిద్ధం చేస్తున్నట్లు తాండూరు మండల విద్యాధికారి వెంకటయ్య గురువారం తెలిపారు. సదరు వ్యక్తి 2012 సంవత్సరంలో దివ్యాంగ ధ్రువపత్రం లేకుండానే వికలాంగ కోటాలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఎస్జీటీగా చేరినట్లు గుర్తించామన్నారు. 2019 జూన్‌ 27న మెడికల్‌ బోర్డు ద్వారా పొందిన దివ్యాంగ పత్రాన్ని సమర్పించారని తెలిపారు. ఎలాంటి ఆధారాల్లేకుండా విధుల్లో కొనసాగడంపై విచారణ చేపట్టినట్లు వివరించారు. నివేదికను జిల్లా విద్యాధికారి రేణుకాదేవి, విద్యా శాఖ కమిషనర్‌ కార్యాలయం అధికారులకు సమర్పించడం జరుగుతుందన్నారు.

ఇచ్చిన హామీలు సర్కార్‌ అమలు చేయాలి: భారాస
వికారాబాద్‌, న్యూస్‌టుడే: ఎన్నికల తరుణంలో రైతులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్‌ సర్కార్‌ వెంటనే అమలు చేయాలని భారాస జిల్లా పార్టీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ ఆనంద్‌ డిమాండ్‌ చేశారు. గురువారం వికారాబాద్‌ పురపాలక సంఘం పరిధిలోని ధన్నారం గ్రామంలో పొలాల్లోకి వెళ్లి ఎండిపోతున్న పంటలను పరిశీలించి, రైతులతో మాట్లాడారు. రూ.2 లక్షల రుణమాఫీ, ఎకరానికి రూ.15 వేల రైతుబంధు, వరికి రూ.500 బోనస్‌ తదితర హామీలను ఆచరణలో అమలు చేయాలని పోస్టుకార్డు ఉద్యమం ద్వారా ప్రభుత్వానికి రాసి పంపించే ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. గ్రామంలో ఫ్యూచర్‌ జన్‌ క్రికెట్‌ కప్‌ టోర్నమెంటును ప్రారంభించారు. అనంతరం మండలంలోని పులుసుమామిడిలో శ్రీ హనుమాన్‌ విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో భారాస నాయకులు పాల్గొన్నారు.